జేడీఎస్ తరఫున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జేడీఎస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచింది.

Last Updated : Apr 28, 2018, 08:15 PM IST
జేడీఎస్ తరఫున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జేడీఎస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. ఈ మేరకు ఆ పార్టీ శుక్రవారం స్టార్ క్యాంపైనర్స్ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్, శాండల్‌వుడ్ హీరోలు ఉన్నారు. వీరు బెల్గాం జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటకలో పర్యటిస్తారని పేర్కొన్నారు.

బెల్గాం గోవా, మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇక్కడి ఓటర్లను ఆకర్షించడానికి మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జెడిఎస్ జాతీయ రాజకీయ నాయకులతో పాటు, కన్నడ, తమిళ, తెలుగు సినిమా నటులతో సహా ప్రముఖ వ్యక్తులతో జాబితాను ఇప్పటికే సిద్ధం చేశాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు వారాలే గడువు ఉంది. అయితే స్టార్‌ క్యాంపెయినర్‌లు ఎప్పుడు ప్రచారం చేస్తారో  షెడ్యుల్‌ను విడుదల చేయలేదు.

శనివారం ప్రచారంలో భాగంగా సీఎం సిద్దరామయ్య బెల్గాం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఇదేరోజు ప్రచారంలో పాల్గొంటారు. మే1 న ప్రధాని మోదీ చిక్కోడి ప్రచారంలో పాల్గొంటారు.

ఉత్తర కర్ణాటకలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేస్తారని జేడీఎస్‌ పార్టీ తెలిపింది. ఉత్తర కర్ణాటక ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నట్లు శుక్రవారమిక్కడ తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. స్టార్ క్యాంపెయినర్‌లుగా కుమారస్వామి కుమారుడు, నటుడు జాగ్వార్‌ సినిమా హీరో నిఖిల్, హీరోయిన్‌ పూజాగాంధీ పేర్లు ప్రకటించారు. త్వరలో సుదీప్‌తో కూడా మాట్లాడనున్నట్లు జేడీఎస్ జిల్లా యూనిట్ అధ్యక్షుడు శంకర్ మదాలగి అన్నారు.

కాంగ్రెస్ తరఫున మహమ్మద్ అజారుద్దీన్, మహారాష్ట్ర శాసనసభ్యుడు అమిత్ దేశ్ముఖ్, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రచారం చేస్తారని చెప్పారు.

బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నటి శృతి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్, మంత్రి పంకజా ముండే, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం చేయనున్నారు.

Trending News