రెండు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు.. వణికిస్తున్న అక్టోబర్ 7

అక్టోబర్ 7 ఆ రెండు రాష్ట్రాలకు గండమే

Last Updated : Oct 4, 2018, 11:27 PM IST
రెండు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు.. వణికిస్తున్న అక్టోబర్ 7

అక్టోబర్ 7వ తేదీ అంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి భయంతో వణికిపోతున్నాయి. అందుకు కారణం ఆ రోజున తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సహా పుదుచ్చేరికి సైతం భారీ వర్షంతో కూడిన తుపాన్ గండం ఉందని, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటూ కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అవడమే. అవును, అక్టోబర్ 7వ తేదీన అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ అధికారులు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. 

అరెబియా సముద్రంలో తుపాన్ కారణంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. అంతేకాకుండా ఈ తుపాన్ ప్రభావం కారణంగా కర్ణాటక, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవుల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

ఈ తుపాన్ ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. కడలూరు జిల్లాలోని కట్టుమన్నార్‌కోయిల్, తిరుచ్చి జిల్లాలోని పుల్లంబడి ప్రాంతాల్లో గురువారం 11 సె.మీ వర్షపాతం నమోదైంది. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అక్టోబర్ 7 పేరెత్తితేనే హడలెత్తిపోతున్నాయి.

Trending News