రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాగం జనార్థన్ రెడ్డి, సూర్యకిరణ్

మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి, విప్లవ గాయకుడు గద్దర్ కుమారుడు సూర్య కిరణ్ బీజేపీ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Last Updated : Apr 25, 2018, 05:46 PM IST
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాగం జనార్థన్ రెడ్డి, సూర్యకిరణ్

మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి, విప్లవ గాయకుడు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ బీజేపీ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితం వీరు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్ గాంధీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు వేములవాడకు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌లో చేరారు.  ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌తో సహా తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

నాగం ఇటీవలే బీజేపీతో సంబంధాలను తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదించిన తరువాత నాగంకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. కాంగ్రెస్ నాయకులు డికె అరుణ, దామోదర్ రెడ్డిలు నాగం చేరికను వ్యతిరేకిస్తున్నప్పటికీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు రాష్ట్ర రాజకీయాల్లో నాగం ప్రముఖ రాజకీయ పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2013లో టీడీపీని వీడి, సొంత పార్టీ తెలంగాణ నగారా సమితిని స్థాపించారు. ఆ తరువాత 2014లో బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ తరఫున 2014 సాధారణ ఎన్నికలలో మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఆయన కొద్ది వారాల క్రితం బీజేపీని వదిలి, కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించారు. మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

సూర్యకిరణ్ మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కోసం పనిచేశారు. ఎమ్మెల్సీ పోస్టుల ఎన్నికలలో ఆయన బీజేపీకి కూడా పనిచేశారు.

కాగా.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కారణంగా బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక వాయిదా పడింది. 

Trending News