రాజోలు బహిరంగ సభలో వైఎస్ జగన్ వరాల జల్లు

తూర్పుగోదావరి జిల్లా రాజోలు బహిరంగ సభలో అశేష జనవాహినికి వైఎస్ జగన్ అభివాదం 

Last Updated : Jun 21, 2018, 05:35 AM IST
రాజోలు బహిరంగ సభలో వైఎస్ జగన్ వరాల జల్లు

సిరి సంపదలతో తులతూగే ప్రాంతంగా పేరున్న కోనసీమ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోందని ఆవేదన వ్యక్తంచేశారు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు నాలుగేళ్ల దుర్మార్గ పాలనలో కోనసీమ కష్టాలపాలైన తీరుచూస్తే గుండె తరుక్కుపోతుంది. గోదావరి ప్రవహించే ఈ గడ్డపై మంచి నీళ్ల కోసం జనం ఇబ్బంది పడటం ఏంటి ? మరోవైపు కోనసీమలో అధికంగా పండించే వరికి కనీస మద్దతు ధర దొరక్కపోతే రైతులు పండించిన పంటకు ప్రయోజనం ఏముంది ? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కొబ్బరి ధర 4వేల రూపాయలు పడిపోయింది. ఇక్కడి ప్రాంతాల్లో బోర్లు వేస్తే ఉప్పునీళ్లు, లేదంటే ఆయిల్‌ కంపెనీల కారణంగా కలుషితమైన నీరు వస్తోంది. కోనసీమ ఇన్ని కష్టాలు పడుతోంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని వైఎస్ జగన్ నిలదీశారు. 194వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్.. సభకు హాజరైన ప్రజానికాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ బహిరంగ సభకు భారీ స్పందన కనిపించింది. జగన్ రాకతో రాజోలు వీధులు జన సంద్రంలా మారాయి.

ఈ సందర్భంగా కోనసీమ ప్రాంతం పడుతున్న కష్టాలను స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్... తమ పార్టీ అధికారంలోకి వస్తే, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం‌ అని మరోమారు ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, అమలు చేయనున్న నవరత్నాలను గుర్తుచేస్తూ ఎన్నికలు జరిగే సమయం నాటికి బ్యాంకుల్లో ఎంతైతే అప్పు ఉంటుందో.. ఆ అప్పంతా నాలుగు దఫాలుగా చెల్లించి అనంతరం వడ్డీ లేకుండా రుణాలు అందిస్తాం. ఆ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తాం అని వైఎస్ జగన్ స్పష్టంచేశారు. 

Trending News