వారసత్వ పోరు: అళగిరి వ్యాఖ్యలు.. స్టాలిన్ వర్గంలో గుబులు

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది.

Last Updated : Aug 13, 2018, 09:50 PM IST
వారసత్వ పోరు: అళగిరి వ్యాఖ్యలు.. స్టాలిన్ వర్గంలో గుబులు

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకొనే సమయంలో అసమ్మతి వర్గం చెలరేగే అవకాశం ఉండటంతో స్టాలిన్ వర్గంలో గుబులు మొదలైంది. కరుణ పెద్ద కుమారుడు అళగిరిని మళ్లీ డీఎంకేలోకి ఆహ్వానించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం డీఎంకే వర్కింగ్‌ కమిటీ సమావేశం కానుంది.

చాలాకాలంగా అళగిరి, స్టాలిన్‌ల మధ్య వారసత్వ పోరు నడుస్తోంది. అయితే కరుణ. స్టాలిన్‌ వైపే మొగ్గుచూపేవారు. అళగిరి మాత్రం ఎలాగైనా తనకే పగ్గాలు దక్కాలని ప్రయత్నించేవారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారన్న కారణంతో.. డీఎంకే అధిష్టానం అళగిరిపై వేటు వేసి బహిష్కరించింది. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇప్పుడు కరుణ మరణంతో అళగిరిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని కుటుంబీకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంకే అళగిరి.. మళ్లీ తమిళ వార్తల్లో నిలిచారు.

అళగిరి గతంలో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పదవిని కట్టబెట్టాలని స్టాలిన్‌ చూస్తుంటే .. తనకు పార్టీ కోశాధికారి లేక ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని అళగిరి పట్టుబడుతున్నట్లు సమాచారం.

డీఎంకే మద్దతు నాకే ఉంది: అళగిరి

మెరీనా బీచ్‌లోని కరుణానిధి స్మారకం వద్ద సోమవారం అళగిరి మీడియాతో మాట్లాడారు. మంగళవారం డిఎంకే వర్కింగ్‌ కమిటీ సమావేశమవుతున్న తరుణంలో అళగిరి మీడియాతో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అళగిరి మాట్లాడుతూ.. డిఎంకే శ్రేణుల మద్దతు తనకే ఉందన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు బాధ కలిగిస్తున్నాయన్నారు. కాలమే దీనికి తగిన సమాధానం చెబుతుందన్న ఆయన.. పార్టీ కార్యకర్తలు తనకే మద్దతు తెలుపుతున్నారని, తననే ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. డీఎంకేకు స్టాలిన్ నాయకుడు ఎలా అవుతాడని అళగిరి ప్రశ్నించారు.

 

అయితే అళగిరి రాకను పలువురు సీనియర్‌ నేతలు ఇష్టపడటంలేదని డీఎంకే వర్గాల సమాచారం. అళగిరి డీఎంకేలోకి వస్తే భవిష్యత్తులో తమకు ఇబ్బందుకు తలెత్తుతాయని వారంతా భావిస్తున్నారు. అందుకు కారణం.. అళగిరిని తప్పించినప్పుడు వారంతా స్టాలిన్‌కు జైకొట్టారు. కాగా.. మంగళవారం జరుగనున్న పార్టీ సమావేశంలో అళగిరి వ్యవహారంపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశముందని డీఎంకే వర్గాలు తెలిపాయి. తమిళనాడులో స్టాలిన్‌కు ఉత్తర, అళగిరికి దక్షిణ ప్రాంతాల్లో పట్టుంది

Trending News