ప్రముఖ దర్శకుడి కన్నుమూత

ప్రముఖ బెంగాలి సినీ దర్శకుడు మృనాల్ సేన్ కన్నుమూత

Last Updated : Dec 30, 2018, 02:29 PM IST
ప్రముఖ దర్శకుడి కన్నుమూత

కోల్‌కతా: ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలన చిత్ర రంగానికి పేరు తీసుకొచ్చిన అతికొద్ది మంది ఫిలిం మేకర్స్‌లో ఒకరైన ప్రముఖ దర్శకుడు మృనాల్ సేన్ (95) ఇవాళ ఉదయం 10:30 గంటలకు కోల్‌కతాలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కోల్‌కతాలోని భవానిపూర్‌లో వున్న సొంత నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు ఆనంద్ బజార్ పత్రిక పేర్కొంది. 1923, మే 14న బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌లో జన్మించిన మృనాల్ సేన్.. అక్కడే 10వ తరగతి పూర్తి చేసిన అనంతరం కోల్‌కతాకు వచ్చి స్థిరపడ్డారు. కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో ఫిజిక్స్ చదువుకున్న మృనాల్ సేన్.. కోల్‌కతా యూనివర్శిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నారు. బెంగాలీలో ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన మృనాల్ సేన్.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతీయ చలన చిత్రాలను ప్రదర్శించి భారతీయ సినీ రంగం ఖ్యాతిని పెంచేందుకు కృషిచేశారు. 

Bengali filmmaker Mrinal Sen dies at 95 at his home in Bhawanipore of Kolkata

ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్, అవార్డ్స్ కమిటీలలో ఆయన జ్యూరిగానూ సేవలు అందించారు. భువన్ షోమ్, మృగయ, అకలేర్ సంధానె, కలకత్తా 71 వంటి పలు చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. వికీపీడియా పేర్కొన్న వివరాల ప్రకారం 1977లో ఆయన తెలుగులో ''ఒక ఊరి కథ'' అనే చిత్రాన్ని సైతం డైరెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మున్షి ప్రేమ్‌చంద్ రచించిన 'కఫాన్' కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అప్పట్లో ఏ పరందామ రెడ్డి అనే నిర్మాత నిర్మించినట్టు వికిపీడియా వివరాలు స్పష్టంచేస్తున్నాయి. 

మృనాల్ సేన్ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృనాల్ సేన్ మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తంచేసిన ఆమె.. సేన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

 

 

Trending News