చంద్రయాన్-2పై ప్రధాని మోదీ స్పందన

చంద్రయాన్-2పై ప్రధాని మోదీ స్పందన

Last Updated : Sep 7, 2019, 11:40 AM IST
చంద్రయాన్-2పై ప్రధాని మోదీ స్పందన

బెంగళూరు: చంద్రయాన్-2 జయాపజయాలతో సంబంధం లేకుండా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. భరతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు సెల్యూట్‌ చేయాల్సిందేనని అన్నారు. శాస్త్రవేత్తల బాధను తానూ పంచుకుంటున్నానన్న ప్రధాని మోదీ... దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న అంకిత భావం ఎంతో గర్వించదగిందన్నారు. చంద్రుడికి మనం దగ్గరగా వెళ్లామని చెబుతూ ఇంతమాత్రానికే వెనకడుగు వేయొద్దని శాస్త్రవేత్తలకు సూచించారు. ఇస్రో పరిశోధనలకు గర్వపడుతున్నామని చెప్పిన మోదీ.. భవిష్యత్‌లో మనం మరిన్ని ప్రయోగాలు చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

నేడు మనకు ఎదురైన పాఠాలే మనల్ని మరింత ధృఢంగా తీర్చిదిద్దుతాయి. ప్రతీ సమస్య మనకు కొత్త పాఠాలను నేర్పుతుంది. సాధించిన ఫలితాలనే కాకుండా... ఫలితాలు సాధించడానికి చేసిన కృషిని కూడా గుర్తించాలి. అలా చూస్తే, చంద్రయాన్‌-2 విషయంలో శాస్త్రవేత్తలు గొప్ప ప్రయత్నమే చేశారని ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. జీవితంలో ఒడిదుడుకులు ఎలాగో ప్రయోగాల్లో జయాపజయాలు కూడా అలాగేనని.. ఇస్రో ప్రయోగాలకు, వాటి విజయాలకు కొలమానం లేదని మోదీ అభిప్రాయపడ్డారు. బెంగుళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News