ఏపీ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ (ఏపీఎస్ఆర్టీసీ) కార్మికులకు 19 శాతం మేర మధ్యంతర భృతి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ (ఏపీఎస్ఆర్టీసీ) కార్మికులకు 19 శాతం మేర మధ్యంతర భృతి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ చెల్లింపునకు ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేశారని, అయితే ఆ కమిటీ నివేదిక వచ్చేలోపే మధ్యంతర భృతి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం ద్వారా సంస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. దీనివల్ల ఆర్టీసీపై నెలకు రూ.240కోట్ల భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 54 వేల మంది ఆర్టీసీ కార్మికులు లబ్ధి చేకూరుతుంది.
విమానాశ్రయాలను తలపించేలా బస్‌స్టాండ్‌లు: వర్ల
విమానాశ్రయాలను తలపించేలా ఆర్టీసీ బస్‌స్టాండ్‌లను అభివృద్ధి చేస్తామని ఏపీ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. గుజరాత్‌లో అత్యాధునిక బస్టాండ్లను పరిశీలించామని, విజయవాడ, విశాఖ, తిరుపతి బస్టాండ్లను... పీపీపీ పద్ధతిలో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీనిపై త్వరలో సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తామని చెప్పారు.