ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ కేపిటల్ అమరావతి కుతకుత ఉడుకుతోంది. అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రాజధాని అమరావతిని తరలించవద్దంటూ ఏడు రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. రోజు రోజుకు అమరావతి ఉద్యమం ఉద్ధృతమవుతోంది. రాజధాని గ్రామాల్లో రైతులు  కదం తొక్కుతున్నారు. రోడ్లపైనే వంటావార్పుతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఏడు రోజులుగా  ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరింత ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన రైతులు.. ఇవాళ రాజధాని ప్రాంత తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవిపై తుళ్లూరు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ శాసన సభ్యురాలు  మద్దతు ఇవ్వడం లేదని మహిళా రైతులు విమర్శించారు.  పైగా కనపడడం లేదంటూ మహిళలు ఫిర్యాదు చేశారు. 


నల్లచొక్కాలతో నిరసన 
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు నిరసనలు చేపట్టారు. ఏడో రోజు నల్ల చొక్కాలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,అమరజీవి పోట్టి శ్రీరాములు ,అంబేద్కర్  చిత్రపటాలు చేత పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతుల నిరసనకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూడా మద్దతు ఇస్తోంది.