అమరావతి: ఏపీకి మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని టీడీపి నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటుపై జిఎన్ రావ్ నివేదిక ఇవ్వకముందే ఆ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారంటే.. ఆ రిపోర్టును ఎవరు తయారు చేశారో స్పష్టంగా అర్థం అవుతోంది. తాను బాగా చదువుకున్నాను అని చెప్పుకుంటున్న సీఎం వైఎస్ జగన్.. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నాను అనడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. రాయలసీమకు నీటి వనరులతో పాటు ఈ ప్రాంతానికి కావలసినవి ఇంకెన్నో ఉన్నాయి. ఆ ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇక్కడ హై కోర్ట్ ఇస్తే ఏం లాభం అని అఖిలప్రియ సర్కారును ప్రశ్నించారు. విశాఖ ముందుగానే అభివృద్ధి చెందిన ప్రాంతం.. అక్కడ మళ్లీ రాజధాని పెట్టడం ఎంత వరకు సబబని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు.. సామాన్యులు ఏదైనా అవసరాల కోసం కర్నూలు నుంచి విశాఖకు వెళ్లాలనుకుంటే ఎలా వెళ్లగలరని నిలదీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన విశాఖలో రాజధానా ?..
అమరావతికి వరద ముంపు భయం ఉందని గతంలో చెప్పిన మీరే.. ఏకంగా తుఫాన్ గండం ఉన్న విశాఖలో రాజధానిని ఎలా పెడతారని మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. విశాఖలో గతంలో విజయమ్మ ఓడిపోయారు కనుకే.. జగన్ అక్కడ రాజధాని అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి తిరిగి అక్కడ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. 


వైసిపి నేతలు ఈ అరాచకాలను ఆపకపోతే..
ఇకనైనా ఈ అరాచకాలను వైసీపీ నేతలు ఆపకపోతే.. ప్రజలే తిరగబడతారని చెబుతూ.. ఈ అన్యాయం, అక్రమాలపైన యువత ముందుకు వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే ప్రజలే అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని అఖిలప్రియ ఆవేదన వ్యక్తంచేశారు. ఓ పక్క ఇసుక కొరత సమస్య.. మరోపక్క ఉల్లి ధరల సమస్య వేధిస్తుండగానే.. మద్యపాన నిషేధం అంటూ వైసీపీ నేతలు నాటు సారా, బెల్టు షాపులు పెంచిపోసిస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు.