తిరుమల పుణ్యక్షేత్రంలో మహా సంప్రోక్షణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆగమ శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ అధికారులకు సూచించారు. పూజాది కార్యక్రమాలకు అవాంతరాలు ఏర్పడకూడదని, పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనానికి ఏర్పాటు చేయాలని అన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో గతంలో పాటించిన నిబంధనలనే అనుసరించాలని సూచించారు. మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని సూచించారు. రోజుల తరబడి దర్శనానికి భక్తులు ఎదురుచూడకూడదని సీఎం టీటీడీ అధికారులను ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24న తుది నిర్ణయం తీసుకుంటాం: టీటీడీ


మహా సంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శన విధి విధానాలపై ఈ నెల 24న జరిగే టీటీడీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఈవో సింఘాల్‌ అన్నారు. అప్పటిలోగా భక్తుల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని.. వచ్చిన అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తే ఇబ్బందులు పడతారనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీకి భక్తుల ప్రయోజనాలే ముఖ్యమని ఈవో స్పష్టం చేశారు.