పార్లమెంట్ హౌజ్‌లో మన్నెం వీరుడు  అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. కాకినాడ ఎంపీ తోట నరసింహం మీడియాకు తెలియజేశారు.  అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని కోరుతూ 2015లో ప్రభుత్వానికి తాము వినతి పత్రాన్ని అందించినట్లు ఆయన ఈ సందర్బంగా తెలిపారు. ఈ అంశంపై పలు చర్చల అనంతరం,  ప్రభుత్వ సూచనలతో ఒక జాయింట్ కమిటీ అనేది ఏర్పడిందని..  ఆ కమిటీలో తాను కూడా ఒక సభ్యుడినని ఆయన తెలియజేశారు.  ఈ  క్రమంలో తనకు ప్రభుత్వం నుండి ఒక ఉత్తరం వచ్చిందని, దాని సారాంశం ప్రకారం పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు. ఒక మన్నెం వీరుడిగా బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం చేసిన మహావీరుడు అల్లూరి అని, అటువంటి ధీశాలి విగ్రహం పార్లమెంట్‌లో ఉండడం మన తెలుగువారికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.