ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఈ రోజు సాయంత్రం స్పష్టత రానుంది. ఇప్పటికే  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన  మూడు రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతి ప్రజలు, రైతుల్లో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి  జగన్ ప్రకటనతో రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ కూడా రాజధాని రైతులతో కలిసి గొంతు కలిపింది. 


సాయంత్రం నిపుణుల కమిటీ తుది నివేదిక
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండవచ్చని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి పరిణామాలను నిర్ణయించేందుకు నిపుణుల కమిటీని నియమించారు. 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి సూచించారు. ఐతే ఇప్పటికే సమావేశమైన నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక  సమర్పించారు. తాజాగా 10 రోజులు తీసుకోకుండా నేటి సాయంత్రం తుది నివేదికను కూడా సమర్పించేందుకు కమిటీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏం చెబుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు ఉంటుందా..? లేదా అలాగే కొనసాగిస్తారా..? అనే అంశాలపై స్పష్టత రానుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిపుణుల కమిటీ ఏం సూచిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన కొనసాగుతోంది.