సత్యం శంకరమంచి.. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన జగమెరిగిన రచయిత. 1937వ సంవత్సరం మార్చి 3 తేదిన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించిన ఆయన ఏలూరు సర్‌ సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో బి.ఏ. చేసి..  ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆయన రాసిన  'అమరావతి కథలు' ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని ఒక్క ఊపు ఊపాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమరావతి గ్రామం, అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఇతివృత్తంగా తీసుకొని రచించిన 100 కథలు విశేష పాఠకాదరణను పొందాయి. తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించిన ఈ కథల్లో ఆ ప్రాంత జనుల భాష, ఆచార వ్యవహారాలు, జీవన విధానాన్ని చాలా చక్కగా రచయిత తెలియజేయడం విశేషం. 1975 ప్రాంతంలో పాఠకులకు పరిచయమైన ఈ కథలకు  1979వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 


ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారట. ఈ ధారావాహిక దూరదర్శన్‌లో ప్రసారం అయ్యాక.. ఈ కథా సంపుటి మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉత్తరాది వారిని ఈ సీరియల్ మరింత ఆకట్టుకుంది. ముఖ్యంగా సామాన్య జనులను పాత్రలుగా తీసుకొని రచయిత కథలను రాయడం విశేషం. ఈ కథా సంపుటికి ముఖచిత్రంలో పాటు ప్రతీ కథకు కూడా ప్రముఖ చిత్రకారులు బాపు వేయడం గమనార్హం. ఈ కథలకు 20 సంవత్సరాలు ముందుగా "కార్తీక దీపాలు" అనే కథ సంపుటిని రచించారు సత్యం శంకరమంచి. అందులో కూడా అమరావతి ప్రాంతాన్ని గురించి విపులంగా చర్చించారు.


చిత్రమేంటంటే అమరావతి కథల్లో శీర్షికలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. సుడిగుండంలో ముక్కుపుడక, లంకల్లపుట్టింది లచ్చితల్లి, గుండె శివుడి కిచ్చుకో, అంతా సామిదే? నేనెవర్ని ఇవ్వడానికి, పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి, రాగిచెంబులో చేపపిల్ల, అరుగరుగో సుబ్బయ్య మేష్టారు, రాజహంస రెక్కలు విప్పింది, అచ్చోసిన ఆంబోతులు, తంపులమరి సోమలింగం, మే!మే! మేకపిల్ల.. లాంటి టైటిల్స్‌తో రచయిత చేసిన ప్రయోగాలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 


"అమరావతి కథలు అపురూప శిల్పాలు....ఉత్తమశ్రేణి ఆధునిక కథావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. వేయిపుటల వేయిపడగల కథలో సత్యనారాయణగారు చిత్రించిన తెలుగుజీవన విశ్వరూపానికి మూడు వాక్యాలో-మూడు మాటలలో ఈ కథలు అద్దం పట్టి చూపాయి. త్యాగరాజస్వామి కీర్తనలతో, స్వరాలతో, అక్షరాలతో, స్వరాక్షరాలతో, రాగభావాలతో కీర్తనలు అల్లి రామచంద్రుడిని అలంకరించుకున్నట్టే ఈయన అంత జాగ్రత్తగా, ప్రేమతో అమరేశ్వరుడిని, ఆయనను సేవించుకునే తెలుగువాడిని అర్చించారు. పట్టరాని అనందం కొద్దీ మనసులో వెయ్యి పేజీలు రాసుకున్నాను.


చదివిన ప్రతివాళ్ళూ పదివేల పేజీలు రాసుకోగలరు కూడా......తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండజ్యోతి పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివి తీరని అమృత కలశం, అక్షయమైన అక్షరపాత్ర. శిల్ప సౌందర్యానికి పరమావధి, ప్రపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం అమరావతి కథలు" అని సాక్షాత్తు ముళ్లపూడి వెంకటరమణ గారే ఈ కథలను ప్రశంసించడం విశేషం


(ఈ రోజు సత్యం శంకరమంచి గారి జయంతి)