అమరావతిని అధునాతన టెక్నాలజీ ఉపయోగించి బ్లూ అండ్ గ్రీన్ సిటీగా నిర్మించడానికి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇటీవలే విజయవాడలో  రహదారులు మరియు భవనాల శాఖ ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు మాట్లాడుతూ "అధునాతన ప్రి ఫాబ్రిక్ టెక్నాలజీతో 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.101 కోట్ల వ్యయంతో 5 అంతస్థులతో ఇక్కడ గ్రీన్ బిల్డింగ్ నిర్మించారు. తక్కువ సమయంలో భవన నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఎనర్జీని ఆదా చేయడానికి ఈ గ్రీన్ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. ఇకపై అన్ని ప్రభుత్వ భవనాలు ఇదే తరహాలో నిర్మిస్తాము. ఇదే భవనంలో ఏపీపీఎస్సీ మరియు ఏపీటీఎస్ కార్యాలయాలు కూడా కొలువుదీరనున్నాయి. ఇప్పుడు ప్రైవేటు భవనాలకి దీటుగా ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నాము.


ఇంకా అధునాతన టెక్నాలజీ ఉపయోగించి రాజధానిని బ్లూ&గ్రీన్ సిటీగా నిర్మించడానికి ప్రభుత్వం ముందుకెళ్తోంది. నాగరికతకు చిహ్నమైనవి రహదారులు, రాష్ట్ర అభివృద్ధికి రోడ్లు కీలకం. ఇటీవల రాష్ట్రంలో జాతీయ రహదారులకి శ్రీకారం చుట్టాము. ప్రతి ఒక్క గ్రామానికి, మండలానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన రోడ్లను వేస్తున్నాము. ప్రజలకోసం సేవచేసే ఉద్యోగస్తులకు అన్నివిధాలా న్యాయం చేసి, ఆదుకుంటానని హామీ ఇస్తున్నాను. ప్రజల సమస్యలను పరిష్కరించి, అన్ని శాఖలను అనుసంధానం చేసుకుని మెరుగైన పాలనను అందించడానికి ఇ-ప్రగతిని తీసుకొచ్చాము. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి 80 శాతానికి పెరిగేందుకు కృషి చేయాలి అని అధికారులకు సూచించాను." అని తెలిపారు.