గత నాలుగు రోజులుగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు నానా యాగి చేస్తూ సభలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి కొంత మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. వివిధ ప్రాజెక్టులు, అవసరాల నిమిత్తం ప్రస్తుతానికి రూ.1,269 కోట్లు విడుదల చేసింది. అందులో రూ.417.44 కోట్లను పోలవరం ప్రాజెక్టుకి కేటాయించింది. అయితే అది గతంలో ఈ ప్రాజెక్టు నిమిత్తం రాష్ట్రం ఖర్చుపెట్టిన మొత్తమే కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యాక, కేంద్రం ఇప్పటి వరకు రూ. 4,329 కోట్ల విడుదల చేయగా.. తాము సైతం ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అంతా కలిపి రూ.7,200 కోట్లు ఖర్చు పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. క్రితం నెలలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసి పోలవరానికి రూ.3,217.63 కోట్లు విడుదల చేయమని వినతి పత్రాన్ని సమర్పించారు.


ఈ క్రమంలో ఈ రోజు కొంత మొత్తాన్ని విడుదల చేయాలి అని భావించిన కేంద్రం రూ.417.44 కోట్లను కేంద్ర జలవనరుల శాఖ తరఫున విడుదల చేసింది.  అలాగే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ క్రింద రూ.369.16 కోట్లను విడుదల చేసింది.


అలాగే అర్బన్ లోకల్ బాడీస్ కోసం రూ.253.74 కోట్లను గ్రాంట్‌గా కేంద్రం విడుదల చేసింది. వాటితో పాటు రూ.196.92 కోట్లను అంగన్వాడీ సర్వీసెస్ స్కీమ్‌కు, మరో రూ.31.76 కోట్లను మహత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌‌మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ క్రింద విడుదల చేసింది.