న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని అధికారిని నియమించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి లేఖ రాయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు అమిత్ షా ఓ లేఖ రాశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎంపీ విజయసాయి రెడ్డికి సైతం కేంద్ర మంత్రి అమిత్ షా మరో లేఖ రాశారు. ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లో సీబీఐ జేడిగా నియమించాలని విజయసాయి రెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీనారాయణ ల్యాండ్ లైన్ నుంచి చంద్రబాబుకు ఫోన్ కాల్స్..
గతంలో సిబిఐ జెడిగా ఉన్న లక్ష్మీనారాయణ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ వైఎస్ జగన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టేందుకు కుట్ర చేశారని.. అందుకే చట్టానికి లోబడి నడుచుకునే వ్యక్తిని దేశ ప్రయోజనాల రీత్యా నియమించాలి కానీ ఎవరో ఒకరి రాజకీయ ప్రయోజనాల కోసమే అవసరాల కోసమో నియమించకూడదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. అప్పటి సీబీఐ జేడి లక్ష్మి నారాయణ అనేక సందర్భాల్లో ల్యాండ్ లైన్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడారని.. అలా చంద్రబాబు ఆదేశాల మేరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు సృష్టించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయాలపై సీబీఐ అంతర్గత విచారణ సైతం జరిగిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. 


తెలుగు దేశం పార్టీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ..
లక్ష్మీనారాయణ ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు సైతం ప్రయత్నించారని.. అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకే చివరకు తెలుగుదేశం పార్టీతో వ్యూహాత్మక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీకి దిగారని విజయసాయి రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఆరోపించారు. 


ప్రస్తుత హైదరాబాద్ సిబిఐ జెడి కృష్ణపైనా ఆరోపణలు..
ప్రస్తుతం హైదరాబాద్ సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణపై సైతం విజయసాయి రెడ్డి పలు ఆరోపణలు చేశారు. సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తేనని, అంతేకాకుండా తెలుగునాట రాజకీయాలతో ముడిపడి ఉన్న అధికారి అని అన్నారు. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమైన కృష్ణ.. అదే వైఖరితో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 


సీబీఐలో చంద్రబాబు మనుషులు..
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఉన్న పరిచయాలను ఆధారంగా చేసుకుని.. తన ఆదేశాలను పాటించే మనుషులను సీబీఐలో పెట్టుకొని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు హయాంలో భారీ అవినీతి జరిగిన నేపథ్యంలో ఆ కేసుల నుంచి బయటపడేందుకు ముందుజాగ్రత్తగా తన మాట వినే అధికారులను హైదరాబాద్‌లో సీబీఐ జేడీ స్థాయి అధికారిగా నియమించుకొనేందుకు తీవ్రంగా పావులు కదుపుతున్నారని విజయసాయి రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో ఎటువంటి సంబంధం లేని, రాజకీయాలకు దూరంగా ఉండే అధికారిని హైదరాబాద్‌లో సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తిచేశారు. 


సీబీఐ జేడీగా వచ్చేందుకు మరో ఆఫీసర్ యత్నాలు..
ఇవన్నీ ఇలా ఉండగా.. మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు అత్యంత సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడిగా వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీబీఐ జేడీగా రాబోయే వ్యక్తిని చట్టానికి లోబడి దేశ ప్రయోజనాల కోసం పని చేసే వ్యక్తి అయ్యుండాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తిచేశారు. విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికార యంత్రాంగానికి లేఖ రాశారు.