ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తాను అవయవ దానం చేయనున్నట్లు ప్రకటించారు. "అవయవ దాన అవగాహన వారోత్సవాలలో" భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా) ఆధ్వర్యంలో ఈ వారం రాష్ట్ర వ్యాప్తంగా అవయవదాన అవగాహన వారోత్సవాలను నిర్వహించింది ప్రభుత్వం. ఈ వారోత్సవాల్లో భాగంగా 1.20 లక్షలమంది తమ అవయవాలను స్వచ్ఛందంగా డొనేట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"జీవన్ దాన్" అనే ప్రభుత్వ పథకంలో భాగంగా ఈ వారోత్సవాలను మెప్మా చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ "నేడు ప్రతీ ఒక్కరికీ అవయవ దానం మీద కనీస అవగాహన రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉంది. మా ప్రభుత్వం కూడా అవయవదాన ఆవశ్యకతను తెలుపుతూ అకడమిక్ సిలబస్‌లో కూడా ఆ అంశాలను చేర్చాలని విద్యాశాఖకు తెలియజేయడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాన్ని మా తరఫున ముందుకు తీసుకెళ్తున్న మెప్మాకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని చంద్రబాబు తెలిపారు. 


ఈ సందర్భంగా తాను కూడా అవయవ దానం చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటూ సంతకాలు చేస్తున్నానని.. సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలు కూడా మరణించాక తమ అవయవాలు పదిమందికీ ఉపయోగపడేలా అనుమతిస్తూ సంతకాలు చేయాలని ఆయన కోరారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జరిపించిన అవయవ దాన అవగాహన వారోత్సవాల్లో రికార్డు స్థాయిలో 1.20 లక్షల మంది.. తాము అవయవదానానికి మొగ్గు చూపుతూ సంతకాలు చేయడంతో.. దీనిని ఒక రికార్డుగా నమోదు చేస్తున్నామని "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్" ప్రతినిధి రాకేష్ శర్మ తెలిపారు.