గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 9ఏళ్ల ఓ బాలికపై సుబ్బయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు, ముస్లిం సంఘాల నాయకులు బాధితులతో కలిసి నార్కట్‌పల్లి-అద్ధంకి రహదారి వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మధ్యాహ్నాంలోగా నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి నిరసనగా దాచేపల్లిలో జరుగుతున్న బంద్ సందర్భంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కథువా రేప్ ఘటన తర్వాత పోక్సో అత్యాచార చట్టాన్ని మరింత కఠినతరం చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. 


కాగా, దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గుంటూరు రూరల్ ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.