ఆర్థికాభివృద్ధికి యువ శక్తి ఎంతో అవసరం: చంద్రబాబు
నిరుద్యోగ యువతకు ప్రతినెలా వెయ్యి రూపాయలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంగళవారం మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి-యువ నేస్తం' పథకాన్ని అక్టోబర్ 2న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.1000ల భృతి అందిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, స్వీయ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా యువతకు శక్తినివ్వడం, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి యువత శక్తిని ఉపయోగించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
రాష్ట్ర శాసన మండలిలో 'యువ నేస్తం పథకం' గురించి మాట్లాడుతూ, యువత మంచి ప్రవర్తనను అలవాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తోందని, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి, శిక్షణ ఇవ్వడానికి 260 శిక్షణా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు.. సింగపూర్, జర్మనీ, యుకె నుంచి కూడా ట్రైనింగ్ పార్ట్‌నర్స్ ఉన్నారన్నారని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ యువతకు సాధికారమివ్వడం కోసం 'జ్ఞాన భేరీ', 'యువ నేస్తం స్కీమ్' లాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడానికి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, కేంద్రం రైల్వే జోన్, కడప వద్ద ఉక్కు కర్మాగారం, రాష్ట్రానికి ప్రత్యేక హోదాలకు సహకారం అందిస్తే.. లక్షలాది మంది ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించిన వారవుతారని అన్నారు.
కేంద్రం సహకారం లేకపోయినా, పోలవరం సహా అనేక నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం.