అమరావతి: ఈనెల 16వతేదీన ఏపీ బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నామని అన్నారు. ఈమేరకు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ గురువారం విలేకరులతో మాట్లాడారు. 16వ తేదీన బంద్‌కు పిలుపునిస్తున్నామని.. అందరూ సహకరించాలని కోరారు. అయితే, అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ‘బంద్‌లు చేయాలని మా‌కు కోరిక కాదు... ప్రజల కోసం రోడ్డెక్కుతున్నాం..’ అని ఆయన అన్నారు. ప్రజలంతా‌ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని లెఫ్ట్ పార్టీలు, హోదా సాధన సమితితో కలిసి పిలుపునిచ్చాయి.


ఈనెల 16వ తేదీన జరిగే ఏపీ బంద్‌కు పలు పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఏపీ బంద్‌కు  వైసీపీ మద్దతు తెలుపుతుందని ఆపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పార్ధసారథి తెలిపారు. 16న జరిగే బంద్‌కు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు బంద్‌కు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ సైకిల్ ర్యాలీలు ఈనెల 22కు వాయిదాపడ్డాయి.