గోదావరి నదిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద పడవ ప్రమాదంలో గల్లంతైన వారికోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల గాలింపు కొనసాగుతోంది.
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద పడవ ప్రమాదంలో గల్లంతైన వారికోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల గాలింపు కొనసాగుతోంది. గజ ఈతగాళ్లతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉండటంతో వారి కుటుంబీకులు రాత్రి నుంచి రేవు ఒడ్డున పడిగాపులు కాస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
శనివారం సాయంత్రం పశువుల్లంకమొండి వద్ద 40 మందితో గోదావరి దాటుతున్న పడవ.. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి అదుపు తప్పి పిల్లర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో పాఠశాలల నుంచి తిరిగి వస్తున్న ఆరుగురు విద్యార్థినులు, ఓ గృహిణి ఉన్నారు.
పశువుల్లంకలో గోదావరి పాయలో పడవ ప్రమాదంలో ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. 9 బోట్లు, గజ ఈతగాళ్లు, 30 మంది అగ్నిమాపక, 74 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఒక బృందం పశువుల్లంక నుంచి ఎగువకు యానం వైపు గాలిస్తుండగా, మరో బృందం యానం నుంచి దిగువకు పశువుల్లంక వరకు గాలిస్తోందన్నారు.
ఘటనాస్థలి వద్దకు చేరుకొని డిప్యూటీ సీఎం చినరాజప్ప సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారిలో పెద్దవారికి రూ.5 లక్షలు, పిల్లలకు రూ.3 లక్షలు ఆర్థిక సాయం ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆయన చెప్పారు.
పడవ ప్రమాద ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందన
గోదావరి పడవ ప్రమాద ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిలబస్ అవ్వకపోవడం వల్లే శని, ఆదివారాల్లో పాఠశాలలు నడిపామని వివరించారు. గోదావరిలో వరద ఉధృతి వల్లే పడవ ప్రమాదం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ప్రయాణించే పడవల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.