ఇకపై కొత్త ఇసుక విధానం.. టన్ను ఇసుక ధర రూ. 375
ఇకపై కొత్త ఇసుక విధానం.. టన్ను ఇసుక ధర రూ. 375
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొత్త ఇసుక పాలసీకి ఆమోదం చెబుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో గురువారం నుంచి ఇక కొత్త ఇసుక పాలసీ అమల్లోకిరానుంది. టన్ను ఇసుక ధర రూ. 375గా ఖరారు చేసిన ఏపీ సర్కార్.. తొలి దశలో58 ఇసుక స్టాక్ పాయింట్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతుల వ్యవసాయ భూముల్లో ఇసుక నిక్షేపాలు ఉన్నట్టయితే, ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.60 చొప్పున ధర చెల్లిస్తామని చెప్పిన మంత్రి.. అవినీతికి ఆస్కారం లేకుండా అతితక్కువ ధరకే ఇసుకను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టంచేశారు. ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. దశలవారీగా ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్స్ సంఖ్య పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సర్కార్ స్పష్టంచేసింది.
ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్ అమర్చడం అక్రమాలకు తావులేకుండా చూసుకుంటామని... పర్యావరణం దెబ్బతినకుండా ఇసుక తవ్వకాలు చేపడతామని మంత్రి వివరించారు. అలాగే స్టాక్‌యార్డ్‌ల్లో అక్రమంగా ఇసుక నిల్వ చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి.. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై నిషేధం అమలులో ఉంటుందని స్పష్టంచేశారు.