అమరావతి: నేడు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు తేదీల ఖరారు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద పంపిణీ చేసిన రూ. 10వేల నగదు, పింఛన్ల పెంపుపై ప్రజా స్పందన వంటి అంశాలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. అలాగే ఢిల్లిలో ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టనున్న ధర్మ పోరాట దీక్ష, ఆ తర్వాత ప్రభుత్వం అవలంభించాల్సి విధివిధానాలపై సమగ్రమైన చర్చ జరగనుందని సమాచారం. 


ఇదిలావుంటే, అగ్రిగోల్డ్‌ అంశంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఇప్పటివరకు కేంద్రం నుంచి అందిన నిధులు, అందాల్సి వున్న సహాయం, వివిధ పరిశ్రమలకు, సంస్ధలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది.