అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎండలను తగ్గించాలని చంద్రబాబు కామెంట్లపై సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఆయన ఆదేశాలతో అమరావతిలో ఉష్ణోగ్రత తగ్గిందంటూ కొన్ని పేజీల్లో ట్రోల్స్ పోస్ట్ అయ్యాయి.  కాగా నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎండలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్న ఆయన ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే చంద్రబాబు ఆదేశాలకు సదరు అధికారులు ఆశ్చర్యపోయారు . ఎండలను తామెలా తగ్గించాలంటూ సీఎం వ్యాఖ్యలపై అధికారులు విస్మయం చెందారు. చెరువులు, కాల్వలు, జలాశయాల్లో నీటినిల్వలు పెంచాలన్నారు. పచ్చదనం, తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడుతుందని బాబు సూచించారు.


30 శాతం వర్షపాతం లోటు ఉన్నా 34 మీటర్ల భూగర్భజలాలు పెంచామని సీఎం అన్నారు. నీరుప్రగతి, జల సంరక్షణ ఉద్యమాలే భూగర్భ జలాల పెంపునకు కారణమన్నారు. భూసారంలో సూక్ష్మ పోషకాల సమతుల్యత ఉండాలన్నారు. బిందుసేద్యం, తుంపర సేద్యం మరింత పెరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలపై దృష్టి పెట్టాలని, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఓడీఎఫ్‌ ప్లస్‌లో కూడా మన రాష్ట్రమే ముందంజలో ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు, కడపలో ఉపాధి కూలీల సంఖ్య మరింత పెరగాలని, ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం కావాలన్నారు.


ఇదిలా ఉండగా..  ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మంగళవారం(మే22, 2018) విశాఖపట్నంలో ధర్మపోరాట సభ జరగనుంది. ధర్మపోరాట సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.