ఎన్టీఆర్‌కు జగన్‌కూ పోలికా..!
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విపక్షాలపై మండిపడ్డారు. శాసనసభను బహిష్కిస్తూ.. సభను సజావుగా నడవకుండా చేస్తూ వారు ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని అడిగారు. జగన్ తనను ఎన్టీఆర్‌తో పోల్చుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానిస్తూ.. "మంచిదే కదా.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది" అన్నారు. తను భూసమీకరణల కోసం అహర్నిశలు కష్టపడుతుంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు ఉత్తరాలు రాస్తూ, రుణం అందకుండా అడ్డుపడడం ఎలాంటి కుటిల రాజకీయమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికి పోలవారం కోసం ప్రభుత్వం 10 వేల కోట్ల వరకూ ఖర్చు చేసిందని, కేంద్రంతో సంప్రదించి వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఇప్పుడు కనుక పూర్తి చేయలేకపోతే జీవితంలో పూర్తిచేయలేమని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు ప్లానింగ్ రిపోర్టులు 45 రోజులలో వస్తాయని, లండన్ వెళ్లి తానే స్వయంగా డిజైనర్ నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులను కలిసి మాట్లాడానని తెలిపారు. అలాగే రాజధాని పరిపాలన విభాగాలన్ని ఒక దగ్గరే ఉండేలా 250 ఎకరాల్లో పరిపాలన భవనాలను నిర్మిస్తున్నామని.. అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను 25 నుండి 30కి పెంచుతామని సీఎం చంద్రబాబు తెలియజేశారు.