కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. ప్రతి ఏటా విజయదశమి పర్వదినాన ఇక్కడ బన్ని ఉత్సవం జరుగుతుంది. దసరా ఉత్సవాల్లో భాగంగా దేవరగట్టు జైత్రయాత్ర పేరుతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. చూసేవారికి అది కర్రలయుద్ధం.. కానీ ఆ పల్లెవాసులకు మాత్రం సంబరం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కర్రలతో తలపడే ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, ఎలాంటి రక్తపాతాలకు తావులేకుండా జరుపుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. ఉత్సవంలో ఎవరూ రింగు కర్రలు వాడవద్దన్న ఆయన.. ఎవరైనా అల్లర్లు, గొడవలు సృష్టిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.


కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో మాలమల్లేశ్వరస్వామి కొలువైన దేవరగట్టులో బన్ని ఉత్సవాలు ప్రతి ఏటా సాంప్రదాయ బద్ధంగా జరుగుతాయి. విజయదశమి పర్వదినాన కల్యాణోత్సవం అనంతరం స్వామి వారిని ఊరేగిస్తారు. ఉత్సవ మూర్తులను మేళతాళాలతో కొండ దిగువన సింహాసన కట్టకు చేరుస్తారు. అక్కడే అక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. ఆచారంలో భాగంగా.. ఉత్సవమూర్తులను తమ వశం చేసుకునేందుకు ఒక వర్గం కర్రల యుద్ధానికి సిద్ధమవుతారు. మరో వర్గం ఆ విగ్రహాలు దక్కకుండా విగ్రహాల చుట్టూ గుంపులుగా ఏర్పడి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. సుమారు 11 గ్రామాల ప్రజలు ఈ పోటీ పడే ఈ ఉత్సవం అర్థరాత్రితో మొదలై పొద్దుపోయేవరకు కొనసాగుతుంది. అనంతరం ఉత్సవమూర్తులను అడవుల్లో తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారి భవిష్యవాణి వివరిస్తారు. అక్కడితో బన్నీ ఉత్సవం ముగుస్తుంది. స్వామిదర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాలప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడా వస్తుంటారు.  


గతంలో బన్నీ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజలు తీవ్రంగా గాయపడి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఆచారాన్ని ఎలాగైనా అరికట్టాలని జిల్లా అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రజలు మాత్రం కొన్ని దశాబ్దాలుగా వస్తున్న తమ సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా కర్రల సమరంలో పాల్గొంటున్నారు. బన్నీ ఉత్సవాల్లో భాగంగా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టుతారు. వైద్యులు శిబిరాలను ఏర్పాటు చేసి గాయపడ్డవారికి తక్షణ వైద్యం అందిస్తారు.