అమరావతి: కొత్త మద్యం పాలసీతో మందు బాబులకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. దశల వారీగా ఐదేళ్లలో సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలు చేస్తానని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఏపీ సర్కార్ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. కొత్త ఎక్సైజ్ పాలసీ నిబంధనల మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4380 మద్యం దుకాణాల్లో 20.09శాతం తగ్గించి 3500 దుకాణాలకు కుదించారు. ఇప్పటివరకు మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులే నిర్వహిస్తుండగా ఇకపై ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోనున్నారు. ఈ మేరకు ఏపీ సర్కార్ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్నింటికి మించి కఠినంగా అమలు చేయనున్న మరో రెండు నిబంధనలు ఏంటంటే.. ఒకటి ఇకపై మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే తెరచి ఉంచడం అయితే, రెండోది వైన్స్ వద్ద పర్మిట్ రూమ్స్ సౌకర్యాన్ని రద్దు చేయడం. అంటే, పాత విధానం కన్నా ఇకపై రాత్రి వేళ ఓ గంట ముందే మద్యం దుకాణాలు మూత పడనున్నాయన్నమాట. అంతేకాకుండా మద్యం ప్రియులు ఇంట్లో వారికి తెలియకుండా వైన్స్ వద్దే మద్యం కొనుగోలు చేసి అక్కడే పర్మిట్ రూమ్స్‌లో తాగేందుకు ఇకపై వీల్లేదు. 


నూతన పాలసీలోని ఇంకొన్ని ఇతర ముఖ్యాంశాలు: 
మద్యం దుకాణాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు. 
150 గజాల నుంచి 300 గజాల స్థలం ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకోవడం. 
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దుకాణాల ఎంపిక. 
డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తూ రూ.17,500 వేతనంతో సూపర్‌వైజర్లుగా నియమించడం. 
ఎమ్మార్పీ ధరలకే మధ్యం అమ్మకాలు.
మద్యం కొనుగోలు చేసిన వారికి విధిగా బిల్లు ఇవ్వడం.