మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసిన ఏపీ సర్కార్
మచిలీపట్నం పోర్టు ఒప్పందం విషయంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
అమరావతి : మచిలీపట్నం పోర్టు ఒప్పందం విషయంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2010 జూన్ 7న అప్పటి ప్రభుత్వంతో జరిగిన మచిలిపట్నం పోర్ట్ అభివృద్ధి ఒప్పందాన్ని రద్దు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. పోర్ట్ డెవలపర్‌కు లీజు అగ్రిమెంట్ కింద ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని సైతం తిరిగి వెనక్కి తీసుకోనున్నట్టు సర్కార్ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఈ ఒప్పందం రద్దుతో పాత ఒప్పందం స్థానంలో ప్రభుత్వరంగ సంస్థల భాగస్వామ్యంతో కొత్త ఒప్పందం చేయనున్నట్టు తెలుస్తోంది.
విశాఖ పోర్ట్ ట్రస్టు ద్వారా బందరు పోర్టు నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని ఎపి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా అభివృద్ధి పనుల ఒప్పందాల విషయంలో ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అభివృద్ధి పనులను కుంటుపడేలా చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.