అమరావతి: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏపీ సర్కార్ శుభవార్త వెల్లడించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి ఇకపై రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు అందించనుంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. 


గతంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు చెల్లించాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించాల్సి ఉండేది. బడ్జెట్‌ కేటాయించినప్పుడే వారికి జీతాలు చెల్లించేవారు. ఒక్కోసారి ఆరు నెలలైనా జీతం అందక ఆర్థిక ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉండేవి. దీంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నెలానెలా జీతాలు అందక అవసరాల కోసం దిక్కులు చూసే పరిస్థితి ఉండేది. కానీ తాజాగా ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో వేల మంది సిబ్బందికి ఇక ఆ బాధలు తప్పనున్నాయి.