వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్ట్‌లందరికి ఇళ్లు స్థలాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 267వ రోజుకు చేరింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. శనివారం పాదయాత్రలో ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ప్రతినిధులు జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిటైరైన జర్నలిస్ట్‌లకు నెలకు రూ.10వేలు పెన్షన్‌ ఇవ్వాలని.. జర్నలిస్ట్‌ చనిపోతే భార్యకు నెలకు ఐదువేలు పెన్షన్‌ ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను వారు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్‌ల సమస్యలపై స్పందించిన జగన్‌.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్ట్‌లందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పూర్తి అధ్యయనం చేసిన తరువాత పెన్షన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పనకు జగన్‌ హామీ ఇచ్చారు.


అటు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 24న విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరనున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పైలాన్‌ ఆవిష్కరించారు.