దేశంలోని సంపన్న సీఎంలలో చంద్రబాబు అగ్రస్థానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా రికార్డులకెక్కారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా రికార్డుకెక్కారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.177 కోట్లని (చంద్రబాబు ఆస్తులు, ఆయన భార్య భువేశ్వరి ఆస్తులు కలిపి) అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. చంద్రబాబు నాయుడు సంపన్న సీఎంల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు, రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.129 కోట్లు.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ (రూ.48 కోట్లు) మూడో స్థానాన్ని ఆక్రమించారు. వీరు ముగ్గురూ పాన్ కార్డు సమర్పించినట్లు తెలిపింది ఏడీఆర్. రూ.15 కోట్ల విలువైన (కేసీఆర్ ఆస్తులు, ఆయన భార్య శోభ ఆస్తులు కలిపి) ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నాలుగో స్థానంలో నిలిచారు. దేశంలోని అత్యంత పేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ తొలి స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో స్థానంలో, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మూడో స్థానంలో ఉన్నారు. సీపీఎంకు చెందిన మాణిక్ సర్కార్ ఆస్తుల విలువ 26,83,195. మమతా బెనర్జీ ఆస్తులు రూ.30 లక్షలు కాగా, మెహబూబా ముఫ్తీ ఆస్తుల విలువ రూ.55 లక్షలని ఏడీఆర్ పేర్కొంది. వీరిలో మాణిక్ సర్కార్ పాన్ కార్డు ఇవ్వలేదని వెల్లడించింది. మొత్తంగా రూ. వందకోట్లు దాటిన ముఖ్యమంత్రులు ఇద్దరు, రూ.10-50 కోట్ల మధ్య ఉన్నవారు ఆరుగురు, రూ.1-10 మధ్య ఉన్నవారు 17 మంది, రూ. కోటిలోపు ఉన్నవారు ఆరుగురు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.
క్రిమినల్ కేసులు ఉన్నవారు
మొత్తం ముఖ్యమంత్రులలో 11 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయి. చంద్రబాబుపై 3, కేసీఆర్‌పై 2 కేసులు నమోదై ఉండగా వీటిలో ఒకటి తీవ్రమైన క్రిమినల్ కేసు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పది కేసులు నమోదయ్యాయి. మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో 20 మందికి క్లీన్ రికార్డు ఉండగా 11 మంది (35 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో 8 (26 శాతం) అత్యంత తీవ్రమైన కేసులు.
ముఖ్యమంత్రులు ఎంతమేరకు చదువుకున్నారు?
మొత్తం ముఖ్యమంత్రులలో డాక్టరేట్ పొందినవారు ఒక్కరు ఉన్నారు. వృతి విద్య పట్టభద్రులు 10, స్నాతకోత్తర విద్య ఐదుగురు, పట్టభద్రులు పన్నెండు మంది, ఇంటర్మీడియట్ పాసైన వారు ముగ్గురు ఉన్నారు.