విజయవాడలో నేటి నుంచి టీడీపీ మహానాడు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నేతలకు మహానాడు అంటే ఒక మహోత్సవం.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నేతలకు మహానాడు అంటే ఒక మహోత్సవం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా మే నెల 27,28,29 తేదీలలో మూడు రోజులు జరిగే ఈ వేడుక మహానాడు-2018 పేరుతో విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో జరుగుతోంది. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ, పార్టీ పటిష్ట నిర్మాణానికి తీర్మానాలు చేస్తూ, సాధించిన విజయాలను మననం చేసుకుంటూ,తెలుగుదేశం పార్టీ మూడు రోజులపాటు నిర్వహించుకునే మహానాడు విజయవాడలో నాలుగోసారి జరుగుతోంది.
ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభం కానుంది. మహానాడులో సీఎం చంద్రబాబు డ్వాక్రా బజార్, ఫొటో ప్రదర్శనను సందర్శించి అనంతరం రక్తదానాన్ని ప్రారంభించనున్నారు. గత సంవత్సర కాలంలో మరణించిన పార్టీ కార్యకర్తలకు మహానాడులో సంతాప తీర్మానం చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మహానాడులో మొత్తం 34 తీర్మానాలు చేయనున్నారు. ఏపీ తీర్మానాలు-22, తెలంగాణ-8, ఉమ్మడి తీర్మానాలు-4.
తొలిరోజు మహానాడులో తెలుగుదేశం పార్టీ 7 తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 5, తెలంగాణకు సంబంధించి 2 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. చివరి రోజు మహానాడులో టీడీపీ కీలక రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనుంది. కాగా మహానాడులో 2 వేల మంది వాలంటీర్లు సేవలు అందించనున్నారు. భోజన వసతి, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.