ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠాను నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం రాత్రి ఆయన నియామక ఉత్త్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం సిఎస్‌గా ఉన్న దినేష్ కుమార్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. అనిల్ చంద్ర 1984 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్ అధికారి.  


అనిల్ చంద్ర ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవారు. సివిల్స్‌లో ఎంపికై రాజంపేట సబ్ కలెక్టర్‌గా కేరీర్‌ను ప్రారంభించి.. మెదక్, కర్నూలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ఉద్యాన శాఖ, కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధిలకు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖలకు ముఖ్య కార్యదర్శి హోదాలోనూ కొనసాగారు. అనిల్ ప్రస్తుతం భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌గా పనిచేస్తున్నారు. నియామకం సందర్భంగా పునేఠా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని అనిల్ చంద్ర అన్నారు.