లోక్సభ, రాజ్యసభల్లో టీడీపీ ఎంపీల అలజడి !
లోక్‌సభలో టీడీపీ ఎంపీలు అలజడి సృష్టించారు. బడ్జె్ట్లో ఏపీకి ఏమీ ఇవ్వలేదని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎంపీలు ఆందోళన చేయగా.. వారిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్‌సభలో టీడీపీ ఎంపీలు అలజడి సృష్టించారు. బడ్జెట్‌లో ఏపీకి ఏమీ ఇవ్వలేదని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎంపీలు ఆందోళన చేయగా.. వారిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు చేస్తున్న నినాదాలు సభకు అంతరాయం కలిగిస్తున్నాయని.. నిరసన తెలిపే పద్ధతి ఇది కాదని చెబుతూ..క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు.
అయినా అలజడి సద్దుమణగపోవడంతో సభను వాయిదా వేశారు. ఇదే సభలో చిత్తూరు ఎంపీ నరమల్లి శివప్రసాద్ తప్పెటగుళ్లు ధరించి వచ్చి, కంజరను వాయించడానికి ప్రయత్నించారు. అయితే ఆయనను సిబ్బంది బయటకు పంపించేయడంతో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు. ఆ తర్వాత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి కూడా నిరసన తెలిపారు.
అదే విధంగా రాజ్యసభలో విభజన హామీల అమలుపై 15 రోజుల్లోగా ఏదో ఒక విషయాన్ని తెలపాలని కేంద్రమంత్రి సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పలేదని.. కనీసం ఇప్పుడైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ నోరు విప్పి విభజన హామీల గురించి.. పోలవరం, అమరావతి నిధుల గురించి ఏదో ఒక మాట చెప్పాలని ఆయన తెలిపారు.
అయితే కేంద్రమంత్రిగా ఉంటూ సుజనా చౌదరి రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎలా వ్యతిరేకిస్తారని వైఎస్సాఆర్ సీపీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతూ..ఇలా చేయడం రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే, ఈ రోజు మురళీ మోహన్, గల్లాజయదేవ్, శివప్రసాద్ మొదలైన ఎంపీలు అందరూ కలిసి "సేవ్ ఆంధ్రప్రదేశ్" పేరుతో ప్లకార్డులు పట్టుకొని, నల్ల గుడ్డలు నోటికి కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంజర వాయిస్తూ.. ఏపీ స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తూ శివప్రసాద్ పార్లమెంటు ఆవరణలో పాటలు కూడా పాడారు.
ఈ సమస్య ఇలా ఉండగా.. బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ రోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరితో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిమిత్తం వారి మధ్య జరిగిన చర్చలో మంత్రి ఈ ప్రాజెక్టును 2019 కల్లా పూర్తిచేస్తానని చెప్పడం గమనార్హం.