ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు అందించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీ ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో 20వేల ప్రభుత్వ ఉద్యోగాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందులో సుమారు 9వేల టీచర్ల పోస్టులతో పాటు ఇతర శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలానే నిరుద్యోగ విధివిధానాలకు ఆమోదం తెలిపారు. 'మఖ్యమంత్రి యువనేస్తం' అనే పేరుతో నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలానే సీఎం నియోజకవర్గం కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిజియో థెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు, నూతన చేనేత విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలానే వుడా పేరు మార్పుకు ఆమోదం తెలిపింది రాష్ట్ర కేబినెట్. విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ పేరును విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్చారు. ప్రస్తుతం ఉన్న వుడా పరిధి 5,573 చ.కి.మీ నుండి 6,764.59 చ.కి.మీ. మేరకు పెంచారు. దీంతో వీఎంఆర్‌డీ పరిధిలోకి 48 మండలాలు, 1,346 గ్రామాలు రానున్నాయి. అలానే వుడాకు విశాఖ మెడ్‌టెక్ జోన్ చెల్లించే రూ.11 కోట్ల పన్ను మినహాయింపునకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.