AP Capital City Issue News: నంద్యాల: ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలింపుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే త్వరలోనే రాష్ట్ర పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుంది అని మరోమారు స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన సమయంలో రెవిన్యూ నెగిటివ్ స్టేట్, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని.. అలా ఉద్యోగుల జీతాలు ఒకటి, రెండు రోజులు ఆలస్యం అవుతుండటం ఇవాళ కొత్తేమీ కాదని అన్నారు. సిబ్బందికి జీతాలు ఆలస్యం అవుతున్నాయని టీడీపీ వివాదం చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. గతంలోనూ జీతాలు ఆలస్యంగా చెల్లించిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1920 నుంచి తెలుగు వారికి శ్రీబాగ్ ఒప్పందం, వికేంద్రీకరణ గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరిగినప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు చూపింది. అలాగే శివరామకృష్ణ కమిటీ కూడా మన పార్లమెంట్ సాక్షిగా వికేంద్రీకరణకి అనుకూల వ్యాఖ్యలు చేయడం చూశాం. అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడం కోసమే రాజధాని విషయంలో కూడా వికేంద్రీకరణ మంచిదనే ఉద్దేశంతోనే వైజాగ్‌ని రాజధానిగా నిర్ణయించడం జరిగింది అని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. 


చంద్రబాబు నాయుడు మీటింగ్‌లో 12 మంది చనిపోయారు కాబట్టే ప్రజల వైపు నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు నియమ నిబంధనలు పాటించమని సూచించాం అని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అంతకుమించి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు అని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని అభివృద్ధి చెందడం కోసం వైజాగ్ నగరం అయితే సరిగ్గా సూట్ అవుతుంది అని అభిప్రాయపడ్డారు. 


వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే శ్రీబాగ్ ఒడంబడికను పరిగణలోకి తీసుకొని హైకోర్టు, వివిధ జుడిషియల్ ట్రిబ్యునల్స్, కమిషన్లు కర్నూలులో ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాజధాని ఒకచోట.. కోర్టులు మరొక చోట ఉండే సంప్రదాయం ఇప్పుడు ఏపీ విషయంలోనే మొదటిసారి కాదని.. దేశంలోని 8 రాష్ట్రాల్లో కూడా కోర్టులు, న్యాయవ్యవస్థ ఒకచోట రాజధాని మరోకచోట ఏర్పాటు చేయడం జరిగింది అని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.