రంజాన్ ఎంతో పవిత్రమాసమని, నెల్నాళ్లు ఎంతో నిష్టగా చేసే దీక్షలకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముస్లింలకు ఆయన రంజాన్ మాస ప్రారంభదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదే కాకుండా, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. ముస్లింలు ఈ నెలరోజులూ ప్రార్ధనలు, ఖురాన్ పఠనంతో గడుపుతారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే రంజాన్ మాసమని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. అసత్యాలకు, దూషణలకు దూరంగా ఉండటం, దయాగుణం, దానగుణం కలిగి ఉండటం సత్ప్రవర్తనకు మార్గాలని, భగవంతుని ఆశీస్సులు తప్పక లభిస్తాయని చంద్రబాబు అన్నారు. ఇవే లక్షణాలు అలవర్చుకుని జీవితమంతా కొనసాగించేందుకు రంజాన్ స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు. 


ఈ ఏడాది ( 2018-19) రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి 1101.90 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 4304 మసీదులలో ఇమామ్స్ కు మౌజన్స్‌కు దేశంలోనే తొలిసారిగా వరుసగా రూ.5000, రూ.3000 గౌరవ పారితోషికం ఇవ్వడానికి వీలుగా 2016-17లో 32 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2018-19 బడ్జెట్ లో రూ.75 కోట్లు కేటాయించామన్నారు. రంజాన్ సందర్భంగా మసీదుల సుందరీకరణకు, ఇఫ్తార్‌లకు ఈఏడాది రూ.5 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.