విజయవాడ: ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. భావితరాలను కాపాడదాం అనే నినాదంతో రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు ఏపీ సర్కార్ ముందడుగేసింది. ఇందులో భాగంగానే ఆదివారం విజయవాడలోని కృష్ణలంక గీతానగర్‌లో మన విజయవాడ పేరుతో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. '' ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. భావితరాలను కాపాడదం '' అని పౌరుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా ప్లాస్టిక్ గ్లాసులు, బాటిల్ వినియోగిస్తున్నట్టుగా కనబడితే, ఆ దృశ్యాన్ని ఫోటో తీసి తనకు పంపించినవారికి రూ.100 బహుమతి ఇస్తానని ప్రకటించారు. తాము కూడా తమ కార్యాలయాల్లో పేపర్ గ్లాసులను మాత్రమే వినియోగిస్తున్నట్టు తెలిపారు. 


ఏదైనా మనది అని భావిస్తే కానీ శ్రద్ధ వహించలేరని.. అందుకే మన విజయవాడ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. అందరూ ఆ దృక్పథంతోనే ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఎల్వి సుబ్రహ్మణ్యం విజ్ఞప్తిచేశారు.