పోలవరం టెండర్లపై కేంద్రం రాసిన లేఖ గందరగోళానికి గురిచేసింది. కేంద్ర జలవనరులశాఖ రాసిన ఈ లేఖపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే పోలవరం పనుల కోసం పిలిచిన టెండర్లను నిలుపుదల చేయాలంటూ కేంద్ర జలవనరులశాఖ ఏపీ సర్కార్‌కు లేఖ రాసింది. దీనిపై చంద్రబాబు అసెంబ్లీలో స్పందిస్తూ..  పోలవరంపై కేంద్ర జలవనరులశాఖ రాసిన లేఖ వల్ల  ప్రాజెక్టు పనులు ముందుకెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెండర్లు ఆపమంటే కుదరదు..


నీతి ఆయోగ్ సూచనల మేరకు పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారని..అందుకే ఈ బాధ్యతను తాము తీసుకున్నామన్నారు. పోలవరం పనులు సకాలంలో పూర్తి కావాలంటే టెండర్లను పిలవాల్సిన అవసరం ఉందని.. అందుకే తాము ఆ పని చేశామని పేర్కొన్నారు.  రాష్ట్రప్రభుత్వం పోలవరం పనులు చేపట్టడం ఇష్టం లేకపోతే కేంద్రమే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నారు. ఈ విషయంలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదిస్తానని చంద్రబాబు వెల్లడించారు.


స్పెషల్ ప్యాకేజీ, ఆర్ధిక లోటు గురించి నిలదీస్తా...


విభజన చట్టాన్ని అనుసరించి ఏపీకి అందాల్సిన రెవెన్యూ లోటు కేంద్రం ఇప్పటి వరకు ఇవ్వలేదని.. ఈ విషయంలో కేంద్ర పెద్దలతో చర్చిస్తాన్నారు. అలాగే ప్రత్యేక హోదా బదులు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్న కేంద్రం..ఇప్పటి వరకు దాన్ని  పూర్తి స్థాయిలో అమలు చేయలేదని.. ఈ విషయంపై కూడా చర్చిస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన అరకొక నిధులపైనే తాను కృతజ్ఞతలు తెలిపానే కానీ..హామీలు మాత్రం పూర్తిగా అమలు కాలేదన్నారు. చంద్రబాబు ఈ స్థాయిలో ఎప్పుడూ కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. తాజాగా చంద్రబాబు వైఖరి చూస్తే కేంద్రాన్ని నిలదీయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోందనేది పలువురి అభిప్రాయం.