ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ గడువు సోమవారంతో ముగియనుంది. ఇప్పటికే వైకాపా నెల్లూరుకు చెందిన పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే..!  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేశారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను రాజ్యసభలో మరోసారి కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం. అలానే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వర్ల రామయ్యకు అవకాశం ఇచ్చారు. కాసేపట్లో అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.


టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నారా లోకేష్,  అచ్చెన్నాయుడులతో భేటీ అయిన అనంతరం... చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చారు. రాజ్యసభ సీటును ఆశిస్తున్న నేతలతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే విడివిడిగా మాట్లాడారు.  మొత్తంగా మధ్యాహ్నం కల్లా అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


కాగా.. రాజ్యసభకు టీడీపీ తరఫున పోటీ చేయాలనుకున్న బీదా మస్తాన్‌‌రావు పోటీ నుంచి తప్పుకున్నారు. బీదా మస్తాన్‌‌రావుకు 2019 ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో రాజ్యసభ పోటీ నుంచి తప్పుకున్నారు. వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీదా మస్తాన్‌‌రావుకు చంద్రబాబు సూచించారు.  


ఏపీలోని ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాల్లో శాసనసభలో బలబలాలను బట్టి తెలుగుదేశానికి రెండు, వైకాపాకు ఒకటి దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో మూడో స్థానానికి కూడా టీడీపీ పోటీ చేస్తుందనే కథనాలు వెలువడ్డాయి. అయితే, వైకాపా తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే.సత్యనారాయణరావు ఎదుట నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముగుస్తుంది. కనుక ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి మార్చి 5న నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ జారీచేసిన సంగతి తెలిసిందే.!