అమరావతి: 2018లో అద్భుతంగా పనిచేశాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో పురోగతి సాధించాం. పౌరులందరికీ కనీస సదుపాయాలు కల్పించాం. ఈ ఏడాది చేసిన కృషికి సంబంధించిన ఫలితాలు వచ్చే ఏడాది కనిపిస్తాయి అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నీరు-ప్రగతి పురోగతిపై నేడు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. తొలి 6 నెలల్లోనే 11.5% వృద్ది సాధించిన ఆంధ్రప్రదేశ్.. ఈ ఏడాది వివిధ రంగాలలో మొత్తం 675కుపైగా అవార్డులు సొంతం చేసుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. కృషి కల్యాణ యోజనలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖ, కడప జిల్లాలు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నట్టు చంద్రబాబు స్పష్టంచేశారు. ముందుచూపు, సరికొత్త ఆవిష్కరణలు, జవాబుదారీతనంలో డిజిటలైజేషన్, కన్వర్జెన్స్, టెక్నాలజీలో ట్రాన్స్‌ఫార్మేషన్‌తోనే ఈ అవార్డులు రాష్ట్రం సొంతమయ్యాయని సీఎం చంద్రబాబు వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రం పురోగతి సాధించడంలో తాను కేవలం బృంద నాయకుడిని మాత్రమేనని, కానీ అసలు ఘనత బృందానికే చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం తిరుగులేని శక్తిగా ఎదగాలని, ప్రపంచం మొత్తం ఏపీ వైపే చూడాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ దేశానికే తలమానికమని చెప్పారు. 


కౌలు రైతుల సంక్షేమం దిశగా కృషి:
5వేల మంది కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేసిన ఘనత యావత్ దేశంలోనే కేవలం ఏపీకి చెందుతుందని చంద్రబాబు అన్నారు. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసి వారికి పెట్టుబడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చేశామని చెప్పారు. పంట బీమా రాష్ట్ర ప్రభుత్వ వాటా వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట బీమా విషయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి వున్న వాటాను వెంటనే విడుదల చేసేలా ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.