దుబాయ్ కు బయల్దేరిన సీఎం చంద్రబాబు
మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకొని, శనివారం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బయల్దేరారు. ముఖ్యమంత్రి బృందం శనివారం నుంచి రెండు రోజులపాటు యూఏఈలో పర్యటించనుంది. భారత కాలగమనం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఈ బృందం దుబాయ్ చేరుకోనుంది. పర్యటనలో భాగంగా ముందుగా శనివారం దుబాయిలోని షేక్ రాషేద్ ఆడిటోరియంలో(భారతీయ పాఠశాల) లో ప్రవాసాంధ్రులతో భేటీకానున్నారు. ప్రవాసీ సంక్షేమ విధానంలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్ కార్యక్రమాలను అమలును వెల్లడించనున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెట్టుబడి అవకాశాలను ఈ సందర్భంగా వారికి వివరించనున్నారు.
దుబాయ్ రాజుతో భేటీ ...
పర్యటనలో భాగంగా దుబాయి రాజు షేక్ మహమ్మద్ రాషేద్ అల్ మఖ్తూంతోపాటు అధికార ప్రముఖులతో సీఎం భేటీకానున్నారు. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ చైర్మన్ షేక్ అహ్మద్ అల్ మఖ్తూంతో కూడా సీఎం సమావేశమవుతారు. అబుదాబికి వెళ్లి యువరాజు అల్ నహ్యాన్, ఆయన సోదరులతో భేటీ అవుతారు.