అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 10% రిజర్వేషన్లలోంచే 5% కాపులకు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రకటించారు. కాపులకు 5% కోటా ఇవ్వగా మిగిలిన 5 శాతాన్నే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వనున్నట్టు చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తామని 2014 ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారమే.. కాపులకు మరో 5% రిజర్వేషన్ కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సర్కార్ ఎప్పటి నుంచో కోరుతున్నా.. కేంద్రం నుంచి సరైన స్పందన కనిపించలేదు.  అందుకే తాజాగా ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం కేంద్రం ప్రకటించిన 10% రిజర్వేషన్‌లోంచే 5 శాతాన్ని కాపులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టంచేశారు. 


రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించరాదని నిరాకరించిన కేంద్రం:
2017, డిసెంబర్ 2న కాపు రిజర్వేషన్ల బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కాపులను వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ షెడ్యూల్ 9లో చేర్చాల్సిందిగా ఏపీ సర్కార్ ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరింది. అయితే రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదనే నిబంధనను చూపిస్తూ కేంద్రం ఏపీ సర్కార్ పంపించిన బిల్లును తిరస్కరించింది అని గత పరిణామాలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.