వైఎస్ జగన్ విషయంలో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేకు చంద్రబాబు సవాల్ !
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేకు చంద్రబాబు సవాల్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఓవైపు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలహీనపరుస్తోంటే... మరోవైపు జగన్‌తో తమకు ఏ సంబంధం లేదని అంటారా ? అంటూ విష్ణుకుమార్ రాజును నిలదీశారు. వైఎస్ జగన్ కేసులను బీజేపీ బలహీనపరుస్తోందని సాక్ష్యాధారాలు చూపిస్తే, వెంటనే మీరు మీ పదవికి రాజీనామా చేస్తారా? అంటూ విష్ణుకుమార్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం వైఖరి గురించి నేటి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. అధికారంలోకొచ్చిన తొలి ఏడాదిలోపే దేశంలో అవినీతిని అంతమొందిస్తాం అని ఎన్నికలకు ముందు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ చేసే రాజకీయం ఇదేనా? అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.