ఇవన్నీ చంద్రబాబు చేసిన సైబర్ క్రైమ్స్ : వైఎస్ జగన్
ఇవన్నీ చంద్రబాబు చేసిన సైబర్ క్రైమ్స్ : వైఎస్ జగన్
హైదరాబాద్: ఎన్నికల్లో గెలవడానికని ఎన్నికల కన్నా రెండేళ్ల ముందు నుంచే ఏపీ సీఎం చంద్రబాబు సైబర్ క్రైమ్‌కి పాల్పడుతున్నారు అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆధార్ వివరాలు తెలుగు దేశం పార్టీకి సాంకేతిక సహాయం అందిస్తున్న ఐటి గ్రిడ్ కంపెనీ వద్దకు ఎలా వచ్చాయో తేలాల్సిన అవసరం ఉందని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వున్న ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల వివరాలు సైతం ఐటి గ్రిడ్ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఎలా నిక్షిప్తమై వున్నాయని వైఎస్ జగన్ నిలదీశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా వున్న ఓట్లను చంద్రబాబు తొలగించుకుంటూ వస్తున్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీకి అనుకూలంగా 59 లక్షల నకిలీ ఓట్లు సృష్టించారని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు నేడు గవర్నర్‌కి మరోసారి ఫిర్యాదు చేశాం అని జగన్ మీడియాకు తెలిపారు.