బీజేపీపై చంద్రబాబు ఫైర్.. పురందేశ్వరి రియాక్షన్
బిజేపీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.
బిజేపీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. బిజేపీ పార్టీ తమతో కలిసి నడవాలని అనుకోకపోతే దండం పెట్టి పక్కకు తప్పుకుంటామని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
"నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నాను. మిత్ర ధర్మంవల్ల నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను. బిజేపీ నాయకులు టిడిపీపై చేస్తున్న విమర్శలపై బిజేపీ అధినాయకత్వం ఆలోచించుకోవాలి" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తే.. చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్రలో శివసేన బాటలో ఒంటరిగానే 2019 సాధారణ ఎన్నికల్లో వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
బిజేపీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ వైసీపీలో గెలిచి.. పార్టీ మారి మంత్రులైన వారిపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు పైవిధంగా స్పందించారు. ఏపీలో పలువురు బిజేపీ నాయకులు కూడా టిడిపీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు అభిప్రాయాలను వెల్లడించారు.
కాగా.. సియం చంద్రబాబు వ్యాఖ్యలపై బిజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. బిజేపీ మిత్ర ధర్మం పాటించడం లేదని చెప్పడం సమంజసం కాదని.. బీజేపీతో ఉండాలో, ఉండకూడదో టిడిపీయే తేల్చుకోవాలని చెప్పారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బిజేపీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చేవారు.. రాజీనామా చేశాకే రావాలని సూచించేవారని గుర్తుచేశారు. ఫిరాయింపు ఎంఎల్ఏల అంశంపై తాము ఇప్పటికే అధిష్టానానికి లేఖ రాశామని తెలిపారు.