2018-19 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి ఏపీలో అధికారలో వున్న టీడీపీకి మధ్య దూరం పెరిగేలా చేస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో టీడీపీ ఎంపీలు కేంద్రంపై నిత్యం తమ నిరసన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి టీడీపీ సిద్ధమైందా అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి. 


ఇదిలావుంటే, ప్రస్తుతం పెట్టుబడులు ఆకర్షించడం కోసం దుబాయ్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అక్కడి నుంచే ఎప్పటికప్పుడు టీడీపీ సీనియర్ నేతలు, పార్లమెంట్ సభ్యులతో టచ్‌లో వున్నట్టు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు.. ఏపీకి అన్యాయం జరిగిన విషయంపై బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించి, వివరణ ఇచ్చేవరకు నిరసన కార్యక్రమాలతో సమావేశాలకు అడ్డుపడి నిరసన తెలపాల్సిందిగా టీడీపీ సభ్యులకి సూచించినట్టు సమాచారం. దుబాయ్ నుంచి తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే టీడీపీ నేతలు ఉభయ సభల్లో నిరసనలతో సమావేశాలకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.