ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఎన్డీయే వర్గాల్లో ఉత్సాహం నెలకొంటే..ఎన్డీయేతర బృందం కాస్త ఢీలా పడినట్లు  కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే సరి..లేకుంటే అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని అయినా వదులుకోకూడదని ఎన్టీయేతర పార్టీలు కృతనిశ్చయంతో కనిపిస్తున్నాయి. మోడీ మళ్లీ అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు విపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి . ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు ముందే ఎన్డీయేతర పార్టీలకు ఏకతాటిపై తీసుకొచ్చే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబుదే కీ రోల్...
ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా.. అడ్డుకునే వ్యూహాన్ని అమలు చేయడంలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయిన బాబు  యూపీఏ విషయంలో తటస్థంగా వ్యవహరిస్తున్న పార్టీలైన.. వామపక్షాలు, ఆప్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీల నేతలతో ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపారు. అలాగే కేంద్ర రాజకీయాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చాలాకాలంగా చర్చల జరుపుతూనే ఉన్నారు.

 


ప్లాన్ 1 ..లేదా ప్లాన్ 2
ఎన్డీయేకు పూర్తిస్థాయి మెజార్టీ రాదనే గట్టి నమ్మకంతో ఉన్న చంద్రబాబు... ఫలితాల నాటికి యూపీఏ పక్షాలు, తటస్థ పార్టీలు ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల ముందు నుంచే  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు..కాంగ్రెస్ సారథ్యంలో కూటమి మహాకూటమికి ప్రయత్నించారు. ఇప్పటికీ అదే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు,  ప్రాంతీయ పార్టీ నేతల ప్రస్తుత ఆలోచన ధోరణి చంద్రబాబును కాస్త ఆలోజింపజేస్తున్నాయి. ఏ మాత్రం అవకాశం వచ్చినా మోడీ సర్కార్ ను ఎలాగైన అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న చంద్రబాబు ప్లాన్ - ఏ, ప్లాన్ - బి అనే రెండు రకాల వ్యహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ - ఏ ప్రకారం కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే ప్రాంతీయ పార్టీలను ఒప్పించి కాంగ్రెస్ సారథ్యంలో పనిచేసేలా చూడటం. అది సాధ్యం కాకుంటే ప్లాన్ బి ప్రకారం ప్రాంతీయ పార్టీల సారథ్యంలో కూటమిగా ఏర్పాటు చేసి ఆ కూటమికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేలా ప్లాన్ రెడీ చేసినట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. 

 


బాబు వ్యూహం ఆచరణ సాధ్యమేనా ?
చంద్రబాబు ప్లాన్స్ అమలకు నోచుకోవాలంటే మే 23న వెలువడే ఫలితాల్లో ఎన్డీయే కూటమికి పూర్తి మెజార్టీ రాకుండా ఉండాలి. ఇలా జరిగి కాంగ్రెస్ కు ఎక్కువ వస్తే ప్రాంతీయ పార్టీలను ఒప్పించడం..అలా కాకుండా హస్తం పార్టీకి తక్కువ సీట్లు వస్తే ప్రాంతీయ పార్టీల సారథ్యంలో కాంగ్రెస్ పనిచేసేలా చూడాల్సి ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్..చరిత్రలో ప్రాంతీయ పార్టీలకు తలవంచిన దాఖలాలు లేవు..ఈ నేపథ్యంలో ప్రాంతీయ  పార్టీల సారథ్యంలో ఆ పార్టీ పనిచేస్తుందని ఊహించడమే కష్టతరంగా ఉంది..అలాగే గతంలో హస్తంతో  దోస్తీ చేసి చేధు అనుభవాలు ఎదుర్కొని యూపీఏ కూటమికి దూరంగా ఉంటున్న ఎస్పీ, బీఎస్పీ, వామపక్షాలు లాంటి పార్టీలు... ప్రత్యేక స్టాండ్ తో నడుస్తున్న తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కాంగ్రెస్ సారథ్యానికి అంగీకరిస్తాయనడమనేది ఇంకా కష్టతరమైన విషయం. మరి అతి క్లిష్టతరమైన ఈ కార్యచరణ చంద్రబాబుతో సాధ్యపడుతుందా అనేది ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతుంది. చంద్రబాబు సామర్థ్యం, గత రాజకీయ పరిణామాల పై లెక్కలుకడుతున్న రాజకీయ విశ్లేషకులు బాబు ఊహించినట్లుగా ఫలితాలు వస్తే ఆయన తన రాజకీయ వ్యూహం అమలు చేయగలరని అభిప్రాయపడుతున్నారు.


ఆ ఛాన్స్ బీజేపీ ఇవ్వదేమో ?


ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ఊహించినట్లుగా ఒక వేళ ఎన్డీయే కూటమికి మెజార్టీ సీట్లకు కాస్త తక్కువగా వచ్చినా ఏదో రకంగా చిన్న పార్టీలను వశపరుచుకొని అధికారం చేజిక్కించుకొనే ఫార్ములా మోడీ-షా జోడీ దగ్గర ఉండకపోదని రాజకీయవర్గాల్లో అంచనాలు ఉన్నాయి. పార్టీ బలాన్ని బట్టి చిన్న చితక పార్టీలు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఊహించినట్లుగా ఒక వేళ ఎన్డీయేకి మెజార్టీ స్థానాలకు కొంచెం తగ్గినా..అధికారం చేసుకోగలదని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ లెక్కలన్నీ తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.