CM Jagan Mohan Reddy: తెలంగాణను మించి ఏపీలో జీఎస్టీ వసూళ్లు.. ఆ రాష్ట్రాల కంటే ఎక్కువే..!
CM Jagan Mohan Reddy Review Meeting: ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు తెలంగాణ కంటే అధికంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని చెప్పారు. పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకురావడంతో ఆదాయాలు మెరుగుపడుతున్నాయన్నారు.
CM Jagan Mohan Reddy Review Meeting: ఆదాయార్జనశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులను దాటుకుని రాష్ట్రంలో ఆదాయాలు గాడిలో పడుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయన్నారు. డిసెంబర్ 2022 వరకు జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం ఉండగా.. ఏపీలో వసూళ్లు 26.2 శాతం ఉన్నాయని అన్నారు. తెలంగాణ (17.3శాతం), తమిళనాడు (24.9 శాతం), గుజరాత్ (20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు ఉన్నట్టుగా అధికారుల వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ.26,360.28 కోట్లు ఉంటే.. 2023 జనవరి నాటికి రూ.28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయన్నారు. గతేడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని అన్నారు.
జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆదాయాలను కలిపిచూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ.46,231 కోట్లు కాగా.. రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామని అధికారులు తెలిపారు. దాదాపు 94 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని.. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయని ముఖ్యమంత్రికి చెప్పారు.
'డేటా అనలిటిక్స్ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయి. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగుపరుచుకుంటున్నాం. ట్యాక్స్ అసెస్మెంట్‌ను ఆటోమేటిక్ పద్ధతుల్లో అందించే వ్యవస్థను నిర్మించుకున్నాం. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నాం. డివిజన్ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేశాం. పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పద్ధతులను అందుబాటులో ఉంచాము..' అని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.
ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు.
గనులు–ఖనిజ శాఖలో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ.3,649 కోట్ల ఆర్జన కాగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నామన్నారు అధికారులు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి రూ.2,220 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆపరేషన్‌లో లేని గనులను ఆపరేషన్‌లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యం రూ.3,852.93 కోట్లు కాగా.. రూ.3,657.89 కోట్లకు చేరుకున్నామని తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి.. పరిస్థితులు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయని వెల్లడించారు.
Also Read: TSRTC: పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సూపర్ డిస్కౌంట్
Also Read: MLC Kavitha: రూ.10 లక్షల కోట్లు ఆవిరి.. ఈ ప్రధాని అవసరమా..?: ఎమ్మెల్సీ కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి